Tuesday, October 11, 2011

దసరా గురించి మీకు తెలీని విషయాలు.... నా వ్యాసంలో. ఆంధ్రభూమి ఆదివారంలో వచ్చింది.

‘అమ్మ’ పండగొచ్చింది

 

దసరా! పేరులోనే కాస్త అటు ఇటూ చేస్తే ‘సరదా’ అవుతుంది. పండగలన్నిటిలోకీ విశిష్టమైంది.
పది రోజులపాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంభ్రమాలతో, ఆటపాటలతో జరుపుకొనే పండగ.
దేవీ నవరాత్రులు జరిపి చివరి (10వ) రోజున విజయదశమిని వైభవంగా జరుపుకొంటాం.
దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రీతిగా పూజించడమే ఈ దసరా ఉత్సవాల ప్రత్యేకత.
ఉగాది సమయంలో, అంటే వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు.
శరదృతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినించి నవమి దాకా జరిగేవి శరన్నవరాత్రులు.
ఈ శరన్నవరాత్రుల సమయంలో ఆదిపరాశక్తి మహిషాసురుని వధించింది కాబట్టే దానికి గుర్తుగా ఆ అమ్మను పూజిస్తారు. అందుకే ఈ శరన్నవరాత్రులనే దేవీ నవరాత్రులనీ అంటారు.
దేవీ నవరాత్రులలో శక్తి ప్రధానం.
దుర్గ తొమ్మిదిరాత్రులపాటు రాక్షసులను వెంటాడి, సంహరించింది.
చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున ‘విజయదశమి’ని దేవతలూ, భక్తులూ అత్యంత వైభవంగా జరుపుకొన్నారు.
అదే ప్రాచీనకాలంనించీ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇక్కడ మనం గుర్తించాల్సిందేమిటీ అంటే, మనలోని దుర్గుణాలే రాక్షసులు. మనలోని దైవాంశే ఆ మహాశక్తి.
ఆ శక్తిని గుర్తించి, ఆరాధించి తద్వారా మనలో ఉండే దుర్గుణాలను తొలగించమని వేడుకోవడమే దుర్గానవరాత్రుల పూజలలోని అంతరార్ధం.
నవరాత్రులు- అంటే ‘నవ’- నూతనమైనదీ, కొత్తదీ అనీ, ‘రాత్రి’-అంటే జ్ఞానమూ అనీ అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు.
వాటిని ప్రసాదించే తల్లియే దుర్గాదేవి. ఆమెనే ఆదిపరాశక్తి. సరస్వతి, లక్ష్మీదేవి. అందుకే మిగతా పండుగల్లో లాగా కాకుండా దసరా వేడుకల్లో ఒక్కోరోజు ఆ శక్తిని ఒక్కో రూపంలో ధ్యానించి, పూజించి, ఆమె కృపకు పాత్రులు కావాలి.
ఒక కథ ప్రకారం పార్వతీదేవికి పది అవతారాలనీ, ఒక్కో అవతారంలో దేవి ఒక్కో రాక్షసుణ్ణి చంపి భక్తులను కాపాడిందనీ అంటారు. మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్య ఘట్టంలో ఈ విషయాల కథనాలున్నాయి.
మధుకైటభులనే రాక్షసులు మానవాళికి కంటకప్రాయులుగా మారారట.
వాళ్ళను మహావిష్ణువు సైతం చంప ప్రయత్నించి విఫలం కావడంతో ‘మాయ’కులోనై చివరికి విష్ణువు కోర్కెమేరకు వారిరువురూ చనిపోయారు. ఇదీ మరో కథనం.
ఆ మాయయే మాయాదేవి. పది తలలు కల్గినదిగా ‘మహాకాళి’గా ఆమెను పిలుస్తారు. కొలుస్తారు.
ఇక రెండో అవతారంలో మహిషాసురుని చంపి, మహిషాసుర మర్దినిగా పేరుపొందింది. సింహ వాహనయై మహిషాసురుని చంపిన మహాశక్తి మూడవ అవతారంలో శుంభు నిశుంభులను సంహరించింది.
నాలుగో అవతారంలో ఈమె నందునికి పుత్రికగా జన్మించి, కంసుడికి హెచ్చరిక చేసి అదృశ్యమైపోయింది. ఐదో అవతారంలో దేవి ఒక రాక్షసిని తన దంతముతో చీల్చినందువల్ల ఆమె రక్తదంతిగా పేరుపొందింది.
అనేక సంవత్సరాలు లోకమంతా క్షామంతో అల్లాడిపోగా, ఆరవ అవతారంలో సస్యశ్యామలయై రక్షించింది. అందుకే ఆ అవతారంలో ఆమె శాకాంబరిగా పేరుపొందింది.
దుర్గుడనే దుర్జనుడైన రాక్షసుని చంపి, తన 7వ అవతారానికి ‘దుర్గ’గా పేరుపొందింది.
ఎనిమిదవ అవతారానికి మాతంగిగా, తొమ్మిదవ అవతారానికి ‘లభ్రమారి’గా పేరుపొందింది శక్తి. నవరాత్రులలో సాధారణంగా దేవీభక్తులు ఉపవాస వ్రతాలు చేస్తారు.
కొందరు జంతుబలులు చేసేవారు కూడా. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటుంది. మనలో జంతువులు, కొన్ని అతి క్రూర జంతువులున్నాయి.
అవే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు. ఆదిశక్తి బలికోరేది ఈ క్రూర జంతువులనే. అంతేకానీ, నోరూవారుూ లేని, అమాయకపు జంతువులైన మేకలూ, గొర్రెలూ, పొటేళ్ళూ కావు. దీనిని అందరూ గుర్తించి నడుచుకోవడమే ‘విజయదశమి.’
భవిష్యత్ పురాణంలో ఈ దేవీ నవరాత్రులకే మహానవమి అనే పేరూ ఉన్నది. ఐతే ఇందులో పైన చెప్పుకొన్న 9 అవతారాల విషయాలు లేవు.
ఈ 9 రోజులలో శస్త్రాస్తమ్రులను పూజించి, చివరి రోజున దేవిని ఏనుగుపై పల్లకిలో ఉంచి ఊరేగించాలని భవిష్యత్ పురాణంలో వర్ణించి ఉంది. నవరాత్రులు గడిచాకే, విజయదశమి పర్వదినం జరుపుకోవాలి. అది సరిగ్గా ఆశ్వయుజ శుక్ల దశమినాడు జరుపుకోవాలి.
ఆశ్విన్యస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే
సకాలో విజయోనాయ సర్వకామార్థ సాధకః
అంటే, ఆశ్వయుజ శుక్ల దశమినాటి సాయంసంధ్యాకాలమునే విజయకాలం అంటారు.
అది సర్వ కార్యసాధకమైన సమయం. ఈ దశమీ దినం శ్రవణా నక్షత్రంతో కలిసి ఉండాలన్నది పెద్దల నిర్ణయం.
ఈ విజయదశమి పుణ్య దినాన ప్రజలంతాచేరి ఊరిలో ఈశాన్యదిక్కున ఉండే శమీవృక్ష (జమ్మి చెట్టు) ప్రదేశానికి వెళతారు. దుర్గాదేవికి అంతకుముందే పూజ చేస్తారు.
‘‘హారేణతు విచిత్రేణ భాస్వత్కనక మేఖలా
అపరాజితా భద్రరతా కరోతు విజయం మమ’’
‘‘మంచి హారంతో, తళుకులీను బంగారు కటి సూత్రంతో మంగళకారియైన దుర్గా! అపరాజితాదేవిగా నాకు విజయమిచ్చుగాక!’’ అని దీని అర్థం.
ఇలా ప్రార్థించి, దుర్గాదేవి పూజ చేశాక శమీ వృక్ష ప్రదేశానికి చేరుతారంతా. అక్కడ శమీవృక్షానికి పూజ చేస్తారు.
‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.’’
ఇలా శమీ వృక్షానికి పూజ చేస్తారు.
పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.
శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.
యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
ఈ శమీ పూజకై వెళ్ళేటప్పుడు గ్రామ/పుర ప్రజలు సీమోల్లంఘన చేయాలి. అంటే, ఊరి పొలిమేరలు దాటి తిరిగి వెనక్కి రావడమన్నమాట.
ఇందులో అంతరార్థం ఏమిటీ అంటే, సీమ అంటే పొలిమేర లేదా హద్దు. హద్దు అనేది సాధారణంగా శతృవులూ, మిత్రులు అనే అంశం వచ్చినపుడు, వారిరువురిమధ్య కొన్ని హద్దులేర్పడ్తాయి.
వాటిని తుడిచేసి, శత్రువులు సైతం పాత కక్షలు మర్చిపోయి అందరూ మిత్రులుగానే ఉండి పోవాలనేదే సీమోల్లంఘన.
పైన చెప్పుకొన్న శమీ వృక్ష సంబంధమైన శ్లోకాన్ని చూస్తే, త్రేతాయుగంలో శ్రీరాముడూ, ద్వాపరయుగంలో పాండవులూ, అందునా అర్జునుడు ముఖ్యంగా శమీ వృక్ష పూజచేసి విజయభేరిని మోగించి శత్రు నాశనం చేశారన్నది తెలుస్తోంది. శ్రీరాముడికి సంబంధించి ఒక కథ వాడుకలో ఉంది.
అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది.
శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు.
అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
ఇక, మహాభారత పరంగా కథ ఏమిటంటే, పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించినపుడు, తమ ఆయుధాలను జాగ్రత్తగా దాచి ఉంచడమెలా? అనే ఆలోచన వచ్చినపుడు శ్రీకృష్ణుని సలహామీద మారువేషాలు ధరించి ఈ జమ్మి చెట్టుమీద దాచి పెట్టి విరాటరాజు కొలువుచేరారు.
అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తర గోగ్రహణ కాలము సంభవించింది. ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీ వృక్షాన్ని దరిచేరి పూజించి, తాము దాచి ఉంచిన ధనస్సునూ బాణాలనూ తీసుకొని శత్రువులపై రణభేరి మోగించి విజయుడైనాడు.
ఈ కారణంగా కూడా శమీ వృక్ష పూజ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొంది.
అతి ప్రాచీన కాలంలో ఆర్యుల దేవతలలో ‘అపరాజితాదేవి’ ముఖ్య దేవత. అపరాజిత అంటే పరాజయములేనిది అని అర్థం. ఈ దేవీ పూజా విషయమై స్కాంద పురాణం ఇలా అంటోంది.
‘‘దశమ్యాం చనరై స్సమ్యక్ పూజనీయా పరాజితా
మోక్షార్థం విజయార్థం చ పూర్వోక్త విధి నా నరైః
నవమీ శేషయుక్తాయాం దశమ్యా మపరాజితా
దదాతి విజయం దేవీ పూజితా జయవర్థినీ’’
నవమీ శేషయుక్తమైన పదవ రోజు (విజయదశమి)నాడు అపరాజితాదేవిని పూజిస్తే సర్వత్రా విజయమే! చాణుక్యుని కాలంలో అపరాజితాదేవి గణనీయయై ఉండిన దేవత. చాణుక్యుడు వ్రాసిన అర్థశాస్త్రంలో అపరాజితాదేవి, అప్రతిహత, జయంత, వైజయంత అనే దేవతలను ఉదహరించాడు. ఈ శక్తిపేర్లన్నీ విజయాన్ని ప్రసాదించేవే.
ఆదిశక్తి. పరాశక్తి. ఆమె వివిధ రూపాల్లో గుర్తించి పూజించడమే నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత.
ఆదిశక్తి కాబట్టి ఆమె ఎక్కడో ఒకేచోట స్థిరంగా ఉండిపోలేదు. సకల విద్యలనూ ఇచ్చే సరస్వతీదేవిగా, ధనసంపదలనిచ్చే లక్ష్మీదేవిగా, సర్వమంగళదాయియైన సర్వమంగళ గౌరిగా ఈ లోకంలో త్రిశక్త్యాత్మకంగా ఆశ్వయుజ మాసంలో పూజలందుకుంటోంది. నవరాత్రులతో విజయదశమిని కలిపి పది రోజులు శక్తి ఉత్సవాలుగా, దసరాగా జరుపుకొంటారంతా.
దసరా అనే పేరు, దశ హర- అంటే పది రోజుల పండుగ! అనే అర్థంలో వాడుకలోకొచ్చింది. దశహర అంటే, పది పాపాలనూ నాశనం చేసేది అని కూడా అర్థం.
ఎవరు నాశనం చేస్తారో? అనే ప్రశ్న వచ్చినపుడు- ఆదిశక్తి, మూలశక్తి అనే జవాబు వస్తుంది.
సాక్షాత్తూ సూర్యభగవానుడే ఆదిశక్తి గురించి ఇలా చెప్పాడు: ‘‘ఆదిశక్తి మహాశక్తి. ఆమే విద్య. అన్ని లోకాలూ ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టి, స్థితి, లయ- ఈ మూడిటికీ మూలశక్తి కూడా ఆదిశక్తే. ఆ తల్లి ప్రేరణ ద్వారానే త్రిమూర్తులు తమ విధులను నిర్వహిస్తారు.’’
సకల దేవతలకూ, దేవపత్నులకూ మూలమైన మహామహి ఆమే. సర్వజ్ఞ, సర్వవ్యాప్తి, సర్వసమర్థ- ఇదీ వేదాల స్తుతి.
గౌరీ మియా య సలిలా తక్షతీ,
ఏక పదీ, ద్విపదీ సా చతుష్పదీ,
అష్టపదీ, నవ పదీ భభూవుషీ,
సహస్రాక్షరా పరమే వ్యోమన్.
- ఇదీ వేద మంత్రం.
దుర్గాదేవి. బ్రహ్మస్వరూపిణిగా, వాగ్దేవిగా ప్రశంసలందుకొన్నది. అందరికీ వాక్కునిచ్చే దేవత ఆమె.
ఆమె జ్యోతిర్మయి. విద్యుత్తు మేఘ గర్భంలో ఉండే నీటిని భూమిపై వర్షింపజేసే రీతిలో, ఆకాశంలో ఉండటంవల్ల ఏకపదియై, అంతరిక్షంతో కూడి ఉండటంవల్ల ద్విపదియై, నాలుగు దిక్కులకూ వ్యాపించి ఉండటంవల్ల చతుష్పదియై, మిగిలిన నాలుగు దిక్కులకూ విస్తరించడంవల్ల అష్టపదియై, ఊర్థ్వ దిశతో కలిసి నవ పదియై, తన అనంత ధారలచే అపార వ్యాప్తియై అంతరాళంలో విహరిస్తోంది.
ఆమెనే శబ్ద బ్రహ్మమయి.
తొలుత ఓంకారమై, ప్రణవ స్వరూపియై ఉండి, వేద వేదాంగాదుల స్వరూపాన్ని స్వీకరించి వివిధ భాషారూప పరివర్తనాలను చెంది సహాస్రాక్షరయై అపరిమిత శక్తి కల్గి, వాగ్దేవి సరస్వతియై విరాజిల్లిన పరమశక్తి.
అందుకే ఆమెను ఆదిశక్తి అన్నారు.
అసలు పరతత్త్వాన్ని దేవీ రూపంగా ఉపాసించడం అనేది అనాదిగా ఉన్నదే.
శక్తివాదపరమైన సూక్తాలూ ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, ‘‘జాత వేదసేసు... తరసేనమః’’ అన్నది చూస్తే, ‘‘పరమాత్మ సంబంధమైన దానివై మా శత్రువులను సంహరించి, కర్మఫలాలను ఇచ్చి భక్తులను సంసార సాగరాన్నించి తరింపజేసే ఓ దుర్గాదేవీ! నీకు నమస్కారం’’ అని శ్రుతి అగ్ని రహస్య కాండలో (యజుర్వేదం). యజ్ఞవేదికపై ఇష్టికలను పేర్చే మంత్రాలు దేవీ విభూతిని వర్ణిస్తాయి.
శుద్ధ బ్రహ్మశక్తి సత్య స్వరూపమే, అన్నట్టు శక్తితత్త్వాన్ని బోధించే ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, శ్రీవిద్యనుంచే ఇతర యంత్రాలన్నీ వచ్చాయి.
ఆమె సర్వయంత్ర స్వరూపిణి. సప్తకోటి మహాయంత్ర స్వరూపాలూ ఆమెవే. అలాగే శ్రీ యంత్రం నుంచి సకల దేవతల యంత్రాలూ ఉత్పన్నమవుతాయి గనకే ఆమెను ‘సర్వతంత్ర స్వరూపా!’ అని కీర్తిస్తాం.
ఈ ఆత్మ విద్యయే షోడశి, భువనేశ్వరి, కాళి- అని త్రిభాగమై కాలాంతరాలలో దశమహా విద్యలుగా పరిణమించాయి. శ్రీ దేవీలీలా విగ్రహ స్వరూప మహాత్మ్యం అనేది అనిర్వచనీయమైనది.
ఇతర దేవతా ధ్యాన స్వరూపాలకీ దేవీ స్వరూపానికీ తేడాలున్నాయి. సాధారణంగా దేవతల ధ్యాన స్వరూపంలో వరాభయ ముద్రలుంటాయి.
పరదేవతా సర్వజగత్తుకూ కల్యాణాన్ని చేకూర్చేది. అందువల్ల దేవికి మాత్రం ముద్రలు గానీ, అభినయాలు గానీ ఏమీ లేకుండానే భక్తుల వరప్రదాయినిగా వెలుగొందుతోంది.
ఈ తల్లి కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళాజీవమనే తొమ్మిది వ్యూహాలే రూపమైన పరశంభుని దేహమే ‘శ్రీమాత!’ ఆ భగవతి దేహమే పరమానంద సంజ్ఞగల శంభువు. క్లుప్తంగా చెప్పాలంటే,
‘‘శక్తిశే్చ చ్ఛాది రూపా, సర్వానుకూలా’’ అయిన ఆ శక్తి మహాత్రిపుర సుందరి. ఆమె భర్త త్రిపురుడు.
మహాకాళి, కాళికాదేవి, కాళి- ఏ పేరున పిలిచినా పలుకుతుంది. ఆమెనే సకల విద్యలకు మూలం. ఆమె విద్యామయ విభూతులే ‘మహావిద్య’లనేవి.
ఒకసారి హిమాలయాల్లోని మతంగ మహాముని ఆశ్రమంలో దేవతలంతా కలిసి ‘మహామాయ’ను స్తుతించారు. ఆ స్తోత్రానికి ప్రసన్నురాలైన అంబిక మతంగ వనితా రూపంలో దర్శనమిచ్చింది.
ఆ సమయాన నల్లనల్లనైన కాటుక వంటి రూపాన్ని కల్గి ఉండింది కాబట్టి ఆమెకు ‘కాళిక’ అనే పేరు వచ్చింది.
ఈ కాళికయే శుంభ నిశుంభులనే రాక్షస సంహారాన్నీ గావించింది కూడా? కాళికాదేవి ‘నీల’ రూపిణియై ‘తారా’నామంతో కూడా వ్యవహరింపబడ్తోంది. యోగ సాధనకు ‘కాళీ’శక్తిని ఉపాసించడం ఆనవాయితీ. దశమహా విద్యల్లో రెండో రూపమే ‘తార’- తారాదేవి. మోక్షాన్నీ ఇచ్చి తరింపజేసేది. కాబట్టే ‘తారా’నామంతో విఖ్యాతమైంది.
ఈమెకే నీల సరస్వతి అనే పేరు ఉంది.
భయంకర విపత్తులనుంచి భక్తులను రక్షిస్తుంది కాబట్టీ, ఈమెను ‘ఉగ్రతారా’ రూపంలో కూడా యోగులు ఆరాధిస్తారు.
దేవి మూడో రూపమే ‘చిన్నమస్త’. ఇది చాలా గోప్యనీయమైంది. నాలుగో రూపం షోడశ మహేశ్వరి.
సంపూర్ణ హృదయురాలు. ఆమె అనుగ్రహిస్తే ఇక జ్ఞానం కరతలామలకమే. విశ్వంలోని మంత్రాదులన్నీ ఈ దివ్యశక్తినే ఆరాధిస్తాయి. ఐదో రూపం భువనేశ్వరి.
సప్తకోటి మంత్రాలూ ఈమెనే ఆరాధిస్తాయి. ఆరవ రూపం త్రిపుర భైరవి. నరసింహావతారపు అభిన్నశక్తియే ఈ త్రిపుర భైరవి. ఈ భైరవికి రాత్రి నామమే ‘కాళరాత్రి’.
ఏదో రూపం ధూమ్రవతి. ఉగ్రతార. విపత్తులను నాశనము చేసి సుఖసంపదలిచ్చే కరుణామ తల్లి. ఎనిమిదో రూపం ‘్భగళాముఖి’. ఐహిక, పారలౌకిక, దేశ, సమాజ దుఃఖాదులను పారద్రోలేది కాబట్టీ ఆమెను శతృనాశినిగా ఆరాధిస్తారు. సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణువూ, పరశురాముడూ- వీరంతా ఆ శక్తి ఉపాసకులే.
తొమ్మిదవ రూపం మాతంగి. పదో రూపం కమలాలయ. ఈమె సమృద్ధికి ప్రతీక. ఈమెనే భార్గవి అని పిలుస్తారు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, శక్తిస్వరూపమనేది అగమగోచరమైంది. ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో కనిపిస్తుంది. గోరంత భక్తిని చూపిన వారికి కొండంత కటాక్షాన్ని కురిపించేది దుర్గమ్మ.
ఆమె కనకదుర్గమ్మ. కోరికలు తీర్చేటి కంచికామాక్షియమ్మ, బాధలను తీర్చేటి భ్రమరాంబికాదేవి. జ్ఞాన, శాంతి సౌఖ్యాలను ఇచ్చేటి శారదాంబ. (శృంగేరీ). వరాలిచ్చి బ్రోచే ఉజ్జయినీ మహాంకాళి. భక్తినిండిన హృదయాలతో శ్రద్ధ, నిష్టలతో ఆ భద్రకాళిని స్మరించడం మాత్రమే మనం చేయాల్సింది.
ఆ తర్వాత ఆ కలకత్తా కాళికాదేవి మనలను కలకాలమూ చల్లగా కాపాడుతుంది.
శ్రీ వేంకటేశ్వరుడు- బ్రహ్మోత్సవాలు: శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనను తెలియనివారూ, కొలవనివారూ ఈ భూమిపై ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు. వెంకటాద్రికి సమమైన స్థానమూ, వేంకటేశుని మించిన దైవమూ ఎక్కడా లేదని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శ్రీ వేంకటేశ్వరుడు శక్తి స్వరూపుడు. ఆయనే శక్తి. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ. మనం ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనిపిస్తాడు.
కొన్ని శతాబ్దాల క్రితం శ్రీ వేంకటేశ్వరుని శక్తిస్వరూపంగా కొలిచారు. అంతకన్నా ముందు జానపదులు గ్రామదేవతగా కొలిచారు. నాడు స్ర్తి దేవతలే శక్తి దేవతలు.
శక్తిదేవతలే గ్రామదేవతలు. ఆ తర్వాత తిన్నగా నేటి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం అక్కడ వెలిసింది. దీనికి తార్కాణంగా, గ్రామదేవతల ముందు అన్నంరాశి- కుంభం పోసినట్లు, ఇప్పటికీ తిరుమలేశుని ముందు కుంభం పోస్తారు. దీనినే తిరుప్పావడ అంటారు.
ఇది కూడా స్వామి శక్తిస్వరూపాన్ని నిర్ధారించే ఆధారమే. శక్తిస్వరూపం కాబట్టే, స్వామికి శుక్రవారాభిషేకం.
శ్రీ వేంకటేశ్వరుని కొన్ని శతాబ్దాల క్రితం శక్తిస్వరూపిణిగా, భగళాముఖిగా ఆరాధించారు కూడా. అన్నిటికీ మించి బ్రహ్మచేసిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలుగా పిలువబడుతున్న తొమ్మిది రోజుల ఉత్సవాలు నవరాత్రులలోనే కడు వైభవంగా జరుగుతాయి.
కనకదుర్గాదేవి:
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఆదిశక్తి రూపమే దుర్గమ్మ.
ఈ దేవాలయం ఎవరు, ఎపుడు కట్టారనడానికి ఆధారాల్లేవు. కొలిచిన వారికి కనక ధారలు కురిపిస్తుంది గనకే ఈమె కనకదుర్గ అయింది. ఈమె గురించిన పురాణ గాథలెన్నో ఉన్నాయి. పాండవులు, వారి కష్టాలు తొలగడానికి శ్రీకృష్ణుడిని సలహామేరకు ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గను పూజించారనీ కథనం ఉంది.
పరమశివునికోసం, ఆయనను మెప్పించి పాశుపతాస్త్రం పొందడంకోసం అర్జునుడు తపస్సు చేసిందీ ఈ కొండమీదేనని మరో గాథ చెబుతోంది.
ఎనె్నన్ని కథలున్నా, దుర్గమ్మకు ఈ నవరాత్రులూ దేవీనవరాత్రుల పేర దసరాలో తొమ్మిది రోజులూ ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఒక్కోరోజు ఒక్కో అలంకారంతో దుర్గమ్మ కనువిందు చేస్తుంది.
మొదటిరోజు శ్రీ స్వర్ణ కవచకుండలాకృత దుర్గాదేవిగా, రెండోరోజు శ్రీ బాలత్రిపుర సుందరిగా, మూడోరోజు శ్రీ గాయత్రీదేవిగా, నాలుగోరోజు శ్రీ అన్నపూర్ణగా, ఐదోరోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా, ఆరో రోజుగా శ్రీ మహాలక్ష్మిగా, ఏడో రోజు శ్రీ సరస్వతీదేవిగా, ఎనిమిదో రోజు శ్రీ దుర్గాదేవిగా, తొమ్మిదోరోజు శ్రీ మహిషాసుర మర్దినిగా, పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరిగా అలంకారాలు జరుగుతాయి.
నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గను దర్శించుకొంటే వారికి దారిద్య్ర బాధలు మటుమాయవౌతాయని భక్తులు నమ్ముతారు.
బాలాత్రిపురసుందరిగా కొలిస్తే, కోరిన కోర్కెలు తీరుస్తుంది. లలితగా దర్శనం చేసుకొంటే, పూజిస్తే వారికి కార్యజయం, సంకల్పసిద్ధీ కల్గుతుంది. గాయత్రిగా దర్శించి, పూజిస్తే జీవితంలో ఒడిదుడుకులు నశించి ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నపూర్ణను దర్శిస్తే, ఇక వారికి అన్నపానాదుల కొరతే ఉండదు.
సరస్వతీదేవిగా పూజిస్తే, సకల విద్యలనూ జ్ఞానాన్ని ఇట్టే సంపాదించుకోవచ్చు. విద్య, జ్ఞానాలతోబాటు వివేకమూ, మేధస్సూ పెంపొందుతాయి.
మహాలక్ష్మిగా అమ్మను దర్శించి కొలిస్తే, సకల సంపదలూ, శుభాలూ మన స్వంతమవుతాయి. దుర్గాష్టమినాడు దుర్గగా కొలిస్తే శాంతమూర్తిగా ఆ తల్లి బాధలనుంచి మనకు విముక్తిని కల్గిస్తుంది. నవమినాడు ఆదిపరాశక్తి మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది.
ఆ దర్శన భాగ్యం కల్గిన వారికి దుర్గుణాలు నశిస్తాయి.
ఆరోజు తల్లి ఉగ్రరూపంలో ఉన్నా, మరునాడు విజయదశమినాడు శాంతమూర్తిగా రాజరాజేశ్వరీదేవిగా సకల కార్యసిద్ధినీ కల్గిస్తుంది. ఇదంతా, ఎవరికి నచ్చిన రూపంలో వారు కొలుచుకోవచ్చని చెప్పడానికే ఏర్పాటు అయ్యింది.
మతము మానవత్వాన్ని పెంచేదిగా ఉండేది ఆనాడు. అందుకే పండుగల పేరున సామాజిక అన్యోన్యతను చాటిచెప్పేవారు.
దసరాల్లో చూడాల్సిన క్షేత్రాలు
మైసూరు చాముండేశ్వరి, కలకత్తా కాళి, ఉజ్జయినీ మహాంకాళి, విజయవాడ కనకదుర్గ, అలంపూరం జోగులాంబ, శృంగేరీ శారదామాత, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, శ్రీకాళహస్తిలో ప్రసూనాంబ, శ్రీశైలంలో భ్రమరాంబిక, వైష్ణోదేవి, మానసాదేవి- ఇలా ఆ పరాశక్తి దేవాలయాలెనె్నన్నో ఉన్నాయి.
ఏ ఒక్క ప్రదేశం వెళ్ళి భక్తితో కొలిచినా సరే! జన్మ ధన్యమైందన్నట్టు! వెళ్ళలేకపోయినా సరే! ఇంట్లోనే సభక్తిపూర్వకంగా కొలిస్తే చాలు.
ఇందుకోసమే, మనవాళ్ళు దసరాల్లో బొమ్మల కొలువు పెట్టేది.
దాని ద్వారా పుణ్యప్రదేశాలు, దివ్యక్షేత్రాలు, దేవతలూ- అందరికీ తెలిసే వీలుంటుంది. అటు పిల్లలకు విజ్ఞానమూ, వినోదమూ! ఇటు పెద్దలకు సోషల్ గేధరింగూ! *
==================
జ్ఞాన, మోక్షదాయి తారాదేవి
సిమ్లాకు వెళ్ళే దారిలో అంటే కాల్కా, సిమ్లా జాతీయ రహదారిపై సిమ్లాకు 11 కి.మీ. దూరంలో తారాదేవి దేవాలయం ఉంది. ఇది 250 ఏళ్ళకు పూర్వమే వెలసిందని కథనం.
పశ్చిమ బెంగాలులో రాజాభూపేంద్రసేన్‌కు వేటలో గోచరమై తనకు గుడి కట్టమని చెప్పింది. ఆమెనే ఆ తర్వాతికాలంలో రాజాబల్‌బీర్ సేన్ (్భపేంద్ర తర్వాతి తరాలకు చెందిన రాజు)కు తారావ్ పర్వతం మీద, సిమ్లాలో నేడు తారాదేవి దేవాలయం ఉండేచోట తనను ప్రతిష్ఠించమని చెప్పిందిట.
అలా తారావ్ పర్వతంమీద వెలసింది తారాదేవి. అష్ట్ధాతు నిర్మితమైన తారాదేవి విగ్రహాన్ని ‘శంకర్’ అనే పేరుగల ఏనుగుపై ఊరేగించి ప్రతిష్ఠ చేశాడా రాజు.
ఈ తారాదేవి గుడికి సమీపంలోనే సంకటమోచన హనుమాన్ మందిరమూ ఉంది. ఎలాంటి కాలుష్యానికీ తావులేని సుమనోహర సుందర ప్రదేశం ‘తారాదేవి’ దేవాలయం.
ఆ ప్రదేశం ఎంత ఆహ్లాదాన్నిస్తుందో ఆ తల్లికూడా అంత చల్లగా చూస్తుంది తన భక్తులను! ఈసారి తారాదేవిని దర్శించినప్పుడు అక్కడే 32 రూపాల్లో గణేశునీ చూడటం మర్చిపోకండి.
పక్కనే సంకట మోచన హనుమాన్ మందిరమూ ఉంది.
సుఖశాంతులనిచ్చే శాంతదుర్గ
దుర్గ. పేరు వింటే మనకు రౌద్ర, భీకర రూపంలో ఉండే శక్తిస్వరూపమే కళ్ళముందు మెదుల్తుంది.
కానీ ‘గోవా’లో శాంతంగా ఉండే, సుప్రసన్న దేవిగా దుర్గామాత వెలసింది. ఆమెనే శాంతదుర్గ. ఈ శాంతదుర్గను పూజిస్తే శివుణ్ణికూడా పూజించినట్లే.
ఎందుకంటే అమ్మవారికి అభిషేకం జరిపేటపుడు పక్కనే ఉన్న శివలింగానికీ అభిషేకం జరగడం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారి సుందర విగ్రహం నాలుగు చేతులు కలిగి నిలిచి ఉండగా, ఆమెకు చెరో ప్రక్క శివ, కేశవులు దర్శనమిస్తారు. 1898 సం. ప్రాంతంలో పఠానుల అరాచకత్వానికి గురి అయ్యి 1902లో తిరిగి పునరుద్ధరించబడిందీ శాంతదుర్గాదేవాలయం.
1965లో ఇక్కడి శివలింగాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. కొత్త శివలింగాన్ని ప్రతిష్ఠించారు.
దుర్గ-మాయమ్మ- సదాప్రసన్నంగా ఉంటూ అందరినీ బ్రోచే ‘శాంతదుర్గ’. దసరా సమయంలో ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది కూడా.
ఈ శాంతదుర్గ దేవాలయానికి సమీపంలోనే మాగేషి, మహాలక్ష్మి, నాగేషి అనే దేవాలయాలూ ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికతను సంతరించుకొన్న ఈ దేవాలయాలు దర్శనీయ స్థలాలు.
ఈ ‘శాంతదుర్గ’ మాతను దర్శించాక ఎపుడూ అల్లకల్లోలంగా ఉండే మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది.
‘నవ’ శబ్దానికీ మనకీ సంబంధం
సకల జీవులను ఉద్ధరించేందుకే ఆ ఆదిశక్తి అష్టాదశ శక్తి క్షేత్రాలుగా, ద్వాదశ శక్తి క్షేత్రాలుగా 52 దివ్యక్షేత్రాలుగా- ఇలా పలు ప్రదేశాలలో మన భక్త్భివాన్ని పెంపొందించి, దైవత్వాన్ని ప్రభోధించే దివ్యక్షేత్రాలై వెలిసాయి.
మానవుల జీవన పధంలో ఆధ్యాత్మిక భావ మందారాలను పూయించే దివ్యకల్పతరువు ఆ ఆదిశక్తి-
మాయ, శక్తి- వీటికి 8, 9 అంకెలతో ఉండే బంధం విడదీయరానిది. దేవీ నవరాత్రుల పూజకీ, శ్రీ విద్యోపాసనకీ, మానవదేహానికీ ఎంతో సంబంధం ఉంది.
మనిషిలో 9 చక్రాలున్నాయి. ఇవి శ్రీ విద్యోపాసనలోని 9 చక్రాలే. అంటే శ్రీ విద్యోపాసన చేయడమంటే, ఆత్మోపాసనే. దేవీ అర్చన అంటే ఆత్మపూజే.
దేహస్థానం చక్రము శ్రీ చక్రంలోని చక్రం
భ్రూమధ్యం ఆజ్ఞా బిందువు
లంబిక ఇంద్రయోగి త్రికోణము
కంఠము విశుద్ధ అష్టకోణము
హృదయము అనాహత అంతర్దశారము
నాభి మణిపూర బహిర్దశారము
వస్తి స్వాదిష్టాన చతుర్దశారము
గుదపానము మూలాధార అష్టదళము
తదధోదేశము కులము షోడశారము
తదధోదేశము ప్రకులము భూపురము

3 comments: